Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, April 25, 2013

1 యోహాను 2వ అధ్యాయము

1. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ  సంగతులను మీకు  వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు.
2. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమే కాదు, సర్వ లోకమునకును  శాంతికరమై యున్నాడు.
3. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీని వలననే ఆయనను ఎరిగియున్నామని తెలికొందుము.
4. ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు,  ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యము లేదు.
5. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను;
6. ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు  నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము.
7. ప్రియులారా, మొదట నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనేగాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు; ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే.
8. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయనయందును మీయందును సత్యమే.
9. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే యున్నాడు.
10. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్న వాడు; అతని యందు అభ్యంతర కారణమేదియు లేదు.
11. తన సహోదరు ద్వేషించువాడు  చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు; చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు.
12. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను.
13. తండ్రులారా, మీరు ఆది నుండి యున్నవానిని ఎరిగి యున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.
14. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగి యున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.యౌవనస్థులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది; మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.
15. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలోనుండదు.
16. లోకములో ఉన్నదంతయ, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.
17. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.
18.  చిన్నపిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తువిరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తువిరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.
19. వారు మనలోనుండి  బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబందులైతే మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడునట్లు వారు బయలువెళ్ళిరి.
20. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు.
21. మీరు సత్యమెరుగనివారైనందున  నేను వ్రాయలేదు గాని, మీరు దానిని ఎరిగియున్నందునను, ఏ అబద్ధమును సత్యసంబంధమైనది కాదని ఎరిగియున్నందునను మీకు వ్రాయుచున్నాను.
22. యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి.
23. కుమారుని ఒప్పుకొనని  ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు .
24. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనియ్యుడి; మీరు మొదట నుండి వినినది మీలో నిలిచినయెడల, మీరుకూడ కుమారునియందును తండ్రియందును నిలుతురు. 
25. నిత్యజీవము అనుగ్రహింతుననునదియే ఆయన తానె మనకు చేసిన వాగ్దానము. 
26. మిమ్మును మోసపరచువారిని బట్టి యీ సంగతులు మీకు వ్రాసియున్నాను. 
27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్నప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు. 
28. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి. 
29. ఆయన నీతిమంతుడని మీరెరిగియున్న యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని యెరుగుదురు.
    Download Audio File

No comments:

Post a Comment